తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
తెలంగాణవ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం జలమయం అయింది. ఎక్ఈకడికక్కడ ట్రాఫిక్ భారీగా జామ్ అవుతున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని అనేక కాలనీలు పూర్తిగా జలమయ్యాయి. ఈ వానలనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇకపోతే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు గురువారం రాత్రి కూడా భారీ వర్షం కురవనుందని, కొన్ని ప్రాంతాల్లో 120 మిల్లీ మీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ పడే అవకాశం ఉందని, నగరవాసులు మరీ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని మేయర్ తెలిపారు.
ఇదిలావుండగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు వర్సిటీలు పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్ (JNTUH), ఉస్మానియా వర్సిటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) తమ పరీక్షలను వాయిదా వేసుకున్నాయి.