- జనసేనకు గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు
- వారాహి ద్వారా ఇప్పటికే నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం
- అభ్యర్ధుల ఎంపికలో పార్టీల కసరత్తు
జనసేన-టిడిపి పొత్తు ఇప్పటికే ఖరారైందా? అవుననే అంటున్నాయి జనసేన పార్టీ వర్గాలు. రెండు నెలల క్రితమే చంద్రబాబుతో పవన్ భేటీలోనే పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చినట్లు చెపుతున్నారు. వారాహి యాత్రతో మొదటి విడత ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ అన్నవరం దేవస్థానంలో పూజ చేసి ప్రారంభించారని, ప్రత్తిపాడు, పిటాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటి, ముమ్మిడివరం , రామచంద్రపురం, రాజ్జానగరం, రాజమండ్రి రూరల్, రాజోలు, భీమవరం, ఏలూరు, మచిలీపట్నం లాంటి నియోజకవర్గాలు జనసేనకు ఖరారు చేసినట్లు చెపుతున్నారు. మొత్తం 48 స్థానాల్లో జనసేన పోటీచేయాలని, ఇందులో అత్యధికంగా గోదావరి జిల్లాలే ఉన్నాయని అందుకే పవన్ ఇకపై ఆయా నియోజకవారాల్లో పదే పదే పర్యటించనున్నారని, పవన్ పూర్తి ఫోకస్ గోదావరి జిల్లాలపై పెట్టారు అని చెపుతున్నారు.
కాగా ముఖ్యమంత్రిగా చంద్రబాబునే ప్రతిపాదించారని తాను తనకు కేటాయించిన స్థానాల్లో మాత్రమె ప్రచారం చేస్తానని, టిడిపికి ప్రచారం చేసే అవకాశం లేదు అని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో ఇప్పటికే పవన్ నాలుగైదు సార్లు భేటీ అయినట్లు ఏప్రిల్ నెలాఖరున జరిగిన కీలక భేటీలో వారి పోత్తులకు తుదిరూపం ఏర్పడినట్లు చెపుతున్నారు.
అయితే ఒకవేళ తమపొత్తులో బిజెపి కనుక భాగస్వామ్యం అయితే టిడిపి స్థానాల నుంచి మాత్రమె వారికి కేటాయించవలసి ఉంటుందని తాము మాత్రం తమ నియోజకవర్గాలను బిజెపికి ఇవ్వబోమని పవన్ చంద్రబాబుకి స్పష్టం చేసారట. ఇప్పటికే ఆయా స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి అనేదానిపై కసరత్తు ప్రారంభించినట్లు కొన్ని చోట్ల స్పష్టతకు వచ్చినట్లు, పవన్ క్రితంలాగానే భీమవరం, గాజువాకల్లోంచి పోటీ చేయాలని నిర్ణయించారట.
ఇకపోతే చంద్రబాబు కూడా తాము పోటీ చేసే స్థానాలపై దృష్తి పెట్టారు. జనసేనకు కేటాయించిన స్థానాల్లో తమ అభ్యర్ధులు తిరుగుబాటు వెయ్యకుండా కట్టడి చేసే వ్యూహం పన్నుతున్నారు. టిడిపిని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను తమ నాయకులకు వివరించి, తాము అధికారంలోకి వస్తే ఆయా నాయకులకు జరిగే లబ్ది కోసం వివరించనున్నారు.
పవన్ లాగే తాము కూడా ప్రచారానికి పవన్ లాగే దూకుడుగా వెళ్లాలని, తాము పోటీ చేయబోతున్న 127 నియోజకవర్గాలలో ఎలా వ్యవహరించాలి అనే వ్యూహాలు ఖరారు చేసారు. అలాగే కాపుల వోట్లు చీలకుండా జనసేనకు పూర్తిస్థాయిలో పడేలా ఎలా వ్యవహరించాలి అనేదానిపై పవన్ కి కొన్ని సూచనలు చేసారు కూడా!
చూస్తుంటే జనసేన-టిడిపి పొత్తు వైసిపిలో కలవరం పెంచేలా ఉంది. తమ సామాజికవర్గ వోట్లతో పాటు పధకాల లబ్దిదారులు, బిసి, ఎస్సీ, ఎస్టీ, వోట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టిన జగన్ వీరిద్దరి ఎత్తుగడలకు ఎలా చెక్ పెడతారో చూడాల్సి ఉంది.