విజయవాడ: జులై 3వ తేదీన పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పౌర్ణమి నాడు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు భక్తులు. గిరి ప్రదక్షిణ అనంతరం అగ్నిరూపంలో వెలిసిన అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ ప్రదక్షిణ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది భక్తులు వెళుతుంటారు.
ఈ సందర్భంగా ఏర్పడే ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. విజయవాడ నుంచి అరుణాచలానికి జూలై 1 వ తేదీన మూడు ప్రత్యేక బస్సులు నడిపించనుంది. జులై 3వ తేదీన పౌర్ణమి కాగా.. అదే నెల 1వ తేదీన రాత్రి 9 గంటలకు ఈ బస్సులు విజయవాడలోని పీఎన్‌బీఎస్ నుంచి అరుణాచలానికి బయలుదేరి వెళ్తాయి.
ఈ టికెట్ ధరను రానూ పోనూ రూ.2490 గా నిర్ణయించారు. లాడ్జింగ్, భోజనం, ఇతర ఛార్జీలు అదనం.
ఒకటో తేదీన బయలుదేరే ఈ బస్ 2వ తేదీన ఉదయం శ్రీకాళహస్తికి చేరుకుంటుంది. కాళహస్తీశ్వరుడిని దర్శనానంంతరం మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలోని కాణిపాకానికి బయలుదేరుతుంది. వరసిద్ధి వినాయక స్వామి ఆలయ దర్శనం అనంతరం తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్‌కు చేరుకుంటుంది. రాత్రి గోల్డెన్ టెంపుల్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం తరువాత అరుణాచలానికి బయలుదేరి వెళ్తుంది. 3వ తేదీ ఉదయం అరుణాచలం చేరుకుంటుంది.
గిరి ప్రదర్శన అనంతరం అరుణాచలం నుంచి అదే రోజు సాయంత్రం బయలుదేరి 4వ తేదీ తెల్లవారు జామున 5 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.
ఈ బస్సులో సీటు రిజర్వేషన్ చేసుకోవడానికి భక్తులు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు